GuidePedia

బైకు మీద వెళ్లడం అంటే సినిమాలు, సీరియళ్లు తీసినంత సులభం కాదని ఏక్తా కపూర్ తెలుసుకుంది. 'మై తేరా హీరో' సినిమా ప్రమోషన్ కోసం అందులో హీరో వరుణ్ ధావన్ ఆమెను తన బైకుమీద ఎక్కించుకుని ముంబైలో తిప్పాడు. అయితే అలనాటి హీరో జితేంద్ర కూతురు కావడంతో ఏక్తాకు చిన్నప్పటినుంచి కార్లు మాత్రమే అలవాటు. బైకు ఎక్కడం అంటే ఏంటో ఇప్పటివరకు తెలియదు. దాంతో మొదటిసారి ఎక్కిందో ఏమో గానీ, చాలా భయంగా అనిపించిందని చెప్పింది. చిన్నప్పుడు రెండుసార్లు సైకిల్ ఎక్కినా, రెండుసార్లూ పడిపోయానని, నాన్న పట్టుకుని తొక్కిస్తే తప్ప సైకిల్ తొక్కేదాన్ని కాదని ఏక్తా తెలిపింది.ఆయన వదిలేయగానే వెంటనే పడిపోయేదాన్నని.. దాంతో అసలు సైకిల్ అన్నా, బైకు అన్నా భయమని అంటోంది.

తొలిసారి తాను వరుణ్ ధావన్ నడిపిన బైకు ఎక్కినందుకు అనేక మహిళా సంఘాల నుంచి తనను తిడుతూ ఈ మెయిళ్లు వచ్చాయని కూడా ఏక్తా తెలిపింది. అయితే వరుణ్ ధావన్ మీద మాత్రం 38 ఏళ్ల ఏక్తా ప్రశంసలు కురిపించేసింది. ఇప్పటివరకు అంత ముద్దొచ్చే కుర్రాణ్ని చూడలేదని, ఎస్కిమోకు కూడా ఐస్ క్రీం అమ్మేయగల చాతుర్యం అతడికి ఉందని చెప్పింది. బైకు విషయం పక్కన పెడితే.. చంద్రుడిమీదకు తీసుకెళ్తానన్నా అతడితో వెళ్లిపోతానని తెలిపింది.

ఇక ఏక్తా ఈ సినిమాకు సహ నిర్మాత కాకపోయినా.. తన తండ్రి డేవిడ్ ధావన్ చెప్పకపోయినా ఈ సినిమాలో తాను ఇంతలా చేయగలిగేవాడిని కానని వరుణ్ ధావన్ అన్నాడు. వాళ్లిద్దరికీ సినిమాలంటే చెప్పలేనంత మమకారం ఉందని, ఏక్తా లేకపోతే అసలు తాను ఇదంతా చేసే సమస్యే లేదని చెప్పాడు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన 'మై తేరా హీరో'లో వరుణ్ సరసన నర్గీస్ ఫక్రీ, ఇలియానా ఇద్దరూ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 4న విడుదల కానుంది.
 
Top