GuidePedia

జనసేన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవిష్కరణ చేయాల్సిన తన రాజకీయ పుస్తకం ‘ISM’ను ప్రముఖ తెలుగు దినపత్రిక గురువారమే అచ్చేసింది. సదరు పుస్తకం ద్వారా పవన్ ఏం చెప్పబోతున్నాడు? అందులో ఏముంది? అసలు ఎందుకిది? లాంటి ప్రశ్నలకు అందులో సమాధానాన్ని పవన్ పొందుపర్చారు. రాజు రవితేజ్‌తో కలిసి పవన్ రచించిన 'ఇజం' పుస్తకంలో 145 పేజీలు,12 అధ్యాయాలున్నాయి. వాటిలోని ముఖ్యమైన అంశాలు (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో) మీకోసం...

 'నోబుల్ థింగ్స్ ఆర్ నెవర్ ఈజీ... నార్ ఆర్ దె కామన్' అనే సూక్తితో పుస్తకం మొదలవుతుంది. 'న్యాయం కోసం పరి తపించే ప్రతి ఒక్కరికీ' ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. 'స్టేట్'అనే పదాన్ని 'దేశం' అనే అర్థంలోనే వాడామని తెలిపారు. 'కమ్యూనిటీ'ని కులం అనే అర్థంలో వాడలేదు.

- 'ఇజం' అంటే...
ఈ పుస్తకానికి 'ఇజం' అనే పేరు ఎందుకు పెట్టారో మొదటే వివరించారు. 'మాకు సంబంధించినంత వరకు ఇజం అంటే... ఐడియలిజం' అని తెలిపారు. సమాజమే దీనికి ప్రాతిపదిక అని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతం కూడా 'ఇజం' అని తెలిపారు. 'సమాజానికి ఏది మంచిదో రాజకీయ పార్టీకి కూడా అదే మంచిది కావాలి' అనేదే జనసేన పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. (ఐడియలిజం అనే పదానికి 'ఆదర్శవాదం' అనే అర్థం ఉంది. కొందరు ఐడియలిజాన్ని భావవాదంగా కూడా పరిగణిస్తారు.)

- ఇదీ నా 'ఐడియాలజీ'
"చిన్నతనం నుంచి ఇప్పటిదాకా నా జీవితమంతా నన్ను ఒక ప్రశ్న వెంటాడుతోంది. అది... భయంలేకుండా బతకడం ఎలా?' అని పవన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. 'మై క్వెస్ట్ ఫర్ యాన్ ఐడియాలజీ' అంటూ తన భావనలను పరిచయం చేశారు. "మంచికి, చెడుకు తేడా ఏమిటి? వాటి గుర్తించడం ఎలా? ఇవీ ప్రశ్నలు! మంచి పని చేసేటప్పుడు... మనలో భయం ఉండదు. మనసు తేలిగ్గా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఒక మంచి పని చేసే వ్యక్తి మనసులో కలిగే అంతర్గత ప్రకాశం అతనికేకాదు... అతను నివసించే సమాజానికీ ప్రసరిస్తుంది'' అని పవన్ విశ్లేషించారు. అయితే... నాయకులు (రాజకీయ నాయకులు మాత్రమే కాదు. సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లోని వారు కూడా) తమను తాము అర్థం చేసుకోకుండా, తమ చర్యలు భావి తరాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోకుండానే.. వ్యవహరించడం బాధ్యతతో కూడుకున్నదేనా? అని ప్రశ్నించారు.

భయం నుంచి, అసహాయత నుంచి బయటపడేందుకు... తమను తాము సమీక్షించుకోవాలని, అవే చక్షువులతో సమాజాన్నీ చూడాలని అభిప్రాయపడ్డారు. "నిర్భయంగా జీవించేందుకు దోహదపడే ఐడియాలజీ కోసం అన్వేషించాను. కమ్యూనిజం, సెపరేటిజం, కుల ప్రాతిపదికన ఏర్పడిన సిద్ధాంతాలు, మతపరమైన సిద్ధాంతాలు... ఇలా చాలా పరిశీలించాను. కానీ... వీటిలో ఏదీ పరిపూర్ణంగా కనిపించలేదు. సామరస్యతను సాధించే సిద్ధాంతం కోసం నేను చేస్తున్న అన్వేషణను ప్రతిఫలించలేదు'' అని పవన్ పేర్కొన్నారు. ఈ పుస్తకంలో పేర్కొన్న విషయాలు తనతోపాటు అందరికీ ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అందుకే... ఈ పుస్తకం జనసేన పార్టీకి సైద్ధాంతిక ప్రాతిపదికగా మారిందని వివరించారు. "ఈ సృష్టిలో నువ్వొక పరమాణువు మాత్రమే అని నాకు నిరంతరం గుర్తు చేసే సువిశాల విశ్వానికి నేను సాష్టాంగపడుతున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను'' అని పవన్ వినమ్రంగా పేర్కొన్నారు.

ఈ పుస్తకం ముందుమాటను రవితేజ రాశారు. 2007 డిసెంబర్ - 2008 జూన్ మధ్య ఈ పుస్తకాన్ని రాశామని తెలిపారు. ఆ తర్వాత పవన్ ఆలోచనల మేరకు మరిన్ని మేలి మార్పులు చేసి ఇప్పుడు ముద్రిస్తున్నామన్నారు. పవన్‌ను అసాధారణమైన ఆలోచనపరుడిగా అభివర్ణించారు. తాను, పవన్ కలిసి మరో 18 పుస్తకాలు రాశామని తెలిపారు కర్మ జ్ఞానం నుంచి 'ఇజం' పుట్టుకొచ్చిందని తెలిపారు.

- ఇలా మొదలైంది...
'ఇజం.. పవన్ చేస్తున్న సైద్ధాంతిక ప్రకటన' అని రాజు రవితేజ్ పేర్కొన్నారు. ప్రజలతో, సమాజంతో స్పష్టమైన సైద్ధాంతిక బంధం ఏర్పాటు చేసుకోవాలని పవన్ భావిస్తున్న సమయంలోనే ఈ పుస్తకం రాశామని తొలి అధ్యాయం 'హౌ ఇజం వాజ్ కన్సీవ్డ్ అండ్ రిటన్'లో పేర్కొన్నారు. 'ఈ సమాజానికి ఎలాంటి సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండాలి? అని పవన్ 30 ఏళ్లుగా ప్రశ్నించుకుంటూనే ఉన్నారు. తనకు తాను వేసుకున్న ఈ ప్రశ్నకు.. తాను ఇస్తున్న సమాధామే ఈ పుస్తకం' అని తెలిపారు. "సామాజిక న్యాయం, పరివర్తన కోసం పరితపించే వారికి ఇది మార్గం చూపుతుంది'' అని రెండో అధ్యాయం 'ది పర్పస్ ఆఫ్ యాన్ ఐడియాలజీ'. ఈ పుస్తకంలో పేర్కొన్నారు. సిద్ధాంతం అనేది సూటిగా, స్పష్టంగా ఉండాలని... అందుకే నిక్కచ్చిగా చెప్పిన కొన్ని విషయాలు కొందరిని ఆశ్చర్యపరచవచ్చునని కూడా చెప్పారు.

- చీకటి.. పేరాశ.. అక్రమం
"ప్రస్తుతం మన దేశాన్ని చీకటి వెంటాడుతోంది. మితిమీరిన ఆశ, భీకరమైన నేరమనస్తత్వం కలగలిసిన శక్తుల చేతుల్లో ఇరుక్కుపోయింది. జనం అంతరాల అగాథాల్లోకి పడిపోతున్నారు. ఈ చీకటి మంచిని వెనక్కి నెట్టేసి... అసమర్థ, అవినీతి, చట్టవ్యతిరేక, దుర్నీత శక్తులు రాజకీయాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అది అధికార పక్షమా, విపక్షమా, సంకీర్ణ పక్షాలా... అనే దానితో నిమిత్తం లేదు. నేరమయ, బాధ్యతారహిత, జవాబుదారీలేని రాజకీయాలే నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిద్ధాంత బలమున్న నాయకత్వం కోసం మనం అన్వేషిస్తాం'' అని మూడో అధ్యాయం 'ఇంట్రడక్షన్ - ది కేస్ ఫర్ యాన్ ఐడియలాజికల్ బేసిస్'లో పేర్కొన్నారు.

రాజకీయం అంటే అధికార సాధన, పరిపాలన కాదని... సమాజాన్ని, దేశాన్ని పద్ధతిలో పెట్టడమే రాజకీయమని కొత్త నిర్వచనం ఇచ్చారు. అది ఒక బాధ్యత అని కూడా తెలిపారు. ఆ 'పద్ధతి' ఏమిటో కూడా చెప్పారు. 'ఉత్తమమైనది మంచి అనేది అత్యున్నత స్థానంలో ఉండాలి. అథమమైనది(వరస్ట్) అట్టడుగున ఉండాలి'' అని వివరించారు. "పిరికి వాళ్లకు, బాధ్యతలను భుజస్కంధాలపై మోయలేని వారికి రాజకీయాలు తగవు. నేరగాళ్లకూ ఇందులో చోటు ఉండకూడదు'' అని పేర్కొన్నారు. "సిద్ధాంతం అనే పదాన్ని నేటి రాజకీయాల్లో, నేటి సమాజంలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. ఎంతగా అంటే... ఇప్పుడు పార్టీలేవీ సిద్ధాంతం అనే పదాన్నే వాడటంలేదు'' అని వ్యాఖ్యానించారు. అత్యధిక పార్టీలకు సిద్ధాంతమనేదే లేదన్నారు. ఎన్నికల ముందు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని తాజాగా వండి వార్చేస్తున్నారని దుయ్యబట్టారు.

- ఇగో... ఇజం
"ఒక జంతువు జీవితాంతం తనను తాను సంరక్షించుకుంటూ ఉంటుంది. తన మనుగడకోసం ప్రయత్నిస్తుంది. ఇవ్వడం, పుచ్చుకోవడం, అర్థం చేసుకోవడం అన్ని జీవ వ్యవస్థల్లో ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. తన స్వీయ మనుగడను, 'నాది' అనుకునే అనుకునే నిర్దిష్ట వ్యవస్థను కాపాడుకునే సహజమైన ప్రక్రియ ఇది. ఇందులో కొంత త్యాగం కూడా ఉంటుంది. కుటుంబాలు, సమూహాలు ఇలాగే ఏర్పడతాయి'' అని నాలుగో అధ్యాయం 'ది స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం యాస్ ది ఫౌండేషన్ ఆఫ్ సొసైటీ'లో వివరించారు. అయితే... మనిషి తన 'స్వీయ పరిరక్షణ' నుంచి విస్తృతమైన కోణంలో ఆలోచించాలని... ఇదే సమాజానికి పునాదిగా మారుతుందని చెప్పారు. "త్యాగం లేకపోతే మనిషి తన స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే దృష్టి పెడతాడు. ఆదిమ కాలానికి వెళ్లిపోతాడు. తన ఆలోచనల్లో సమాజానికి చోటు ఉండదు. నేను, నా సమూహం అనే జంతువుల్లాంటి మనుషులే మిగులుతారు'' అని సూటిగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్లతో సమాజాలు నిర్మాణం కావని పేర్కొన్నారు.

-పొరపాటు వద్దు..
"ఐడియలిజం ప్రాక్టికల్‌గా ఉండదని, వాస్తవానికి దూరంగా ఉంటుందని అనుకుంటారు. ఐడియలిజానికి సంబంధించిన అతిపెద్ద పొరపాటు భావన ఇదే'' అని పవన్, రాజు రవితేజ్ ఈ పుస్తకంలోని ఐదో అధ్యాయం 'మిస్ అండర్ స్టాండింగ్స్ అబౌట్ ఐడియలిజం'లో తెలిపారు. ఏదీ వాస్తవానికి దూరంగా ఉండరాదని అభిప్రాయపడ్డారు. ఇగోయిజం, ఆచరణాత్మక వాస్తవికత, స్వార్థం తదితర అంశాలపై ఈ అధ్యాయంలో చర్చించారు. "మనకు మంచి సమాజం కావాలి. కానీ, మనం మాత్రం త్యాగాలు చేయకుడదు. మన మంచికోసం, మన సౌఖ్యం కోసం ఇంకెవరో త్యాగాలు చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్న సమాజాలు అందరి హితం కోరుకోవు'' అని పేర్కొన్నారు.

- ఇగో ఎక్కువైతే...
సమాజంలో ఇగోయిజం ఎక్కువైతే చట్టాలన్నీ అలంకార ప్రాయాలే అవుతాయని, అవి పెద్దలకే ఉపయోగపడతాయని ఆరో అధ్యాయం 'ఇగోయిజం అండ్ లాలెస్‌నెస్'లో పేర్కొన్నారు. "ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉండదు. ప్రత్యేకంగా కొందరి కోసమే ఉంటుంది. వారే శాసిస్తారు, వారే శపిస్తారు. వాళ్లు మాత్రం ఆనందంగా, భద్రంగా, మరింత సంపన్నులుగా మారుతుంటారు'' అని వివరించారు. 'ఇగో' ప్రబలంగా ఉండే సమాజంలో చట్టంపట్ల గౌరవం, భయం ఉండవని తెలిపారు. పైగా... చట్టం కళ్లను ఎలా కప్పాలి, నిబంధనలను ఎలా అతిక్రమించాలి అనే తెలివితేటలున్న వారు, నాయకులు కలిసి పని చేస్తారని తెలిపారు. 'పెద్ద సంఖ్యలో చట్టాలున్నంత మాత్రాన మంచి సమాజం కాబోదు. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగల స్వీయ చైతన్యం, అత్యుత్తమ ప్రవర్తన ఉన్నదే 'లాఫుల్ సొసైటీ' (మంచి సమాజం) అవుతుంది'' అని ఏడో అధ్యాయం 'ఎథిక్ - ది ఐడియల్ ఫామ్ ఆఫ్ కండక్ట్'లో పవన్, రాజు రవితేజ్ వివరించారు.

-వ్యక్తిపూజ...
మాజీ నాయకుడి కుమారుడైన యువ నాయకుడి చుట్టూ తిరుగుతూ... వారిని యువరాజుగా పేర్కొనడంపై ఎనిమిదో అధ్యాయం 'ది ఐడియల్ ఫామ్ ఆఫ్ ఆర్గనైజింగ్ సొసైటీ'లో సునిశిత వ్యాఖ్యలు చేశారు. వారికి నిజంగానే అర్హతలున్నాయా? అని ప్రశ్నించారు. "మనలో ఒకరు... మనస్థాయిలో కష్టపడకుండా... మనకంటే ఎన్నో విశేషాధికారాలు సాధించడమంటే ఎక్కడో తప్పు జరుగుతున్నట్లే'' అని వ్యాఖ్యానించారు.

- ఎవరు దేవుడు?
'ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. మరి.. ఆ దేవుడిని సృష్టించింది ఎవరు?' అనే ప్రశ్నతో 9వ అధ్యాయం 'కనెక్టింగ్ విత్ అవర్ డివినిటీ' మొదలవుతుంది. దేవుడు - మతం - సమాజం... అనే అంశాలపై ఇందులో చర్చించారు. మతం బలమైన స్థానంలో ఉన్న సమాజాలన్నీ నైతికంగా బలంగా ఉండక్కర్లేదని అభిప్రాయపడ్డారు. నైతికబద్ధమైన సమాజానికి తొలి ప్రాతిపదిక 'ఐడియల్స్' అని తెలిపారు. "ఒకటి భౌతిక వాస్తవికత, మరొకటి.. ఆధ్యాత్మిక వాస్తవికత. మనిషి ఈ రెండింటి సమ్మేళనం. మనిషికి తెలియని విషయాలు ఉన్నంతకాలం దేవుడు శక్తిమంతంగా ఉంటాడు'' అని పేర్కొన్నారు. మతం మనిషికి క్రమశిక్షణను, మంచి ప్రవర్తనను నేర్పిస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో మతానికి వ్యతిరేకంగా వస్తున్న విమర్శలకు కారణాలనూ విశ్లేషించారు.

-విలువల వృక్షం..
ఐడియలిజం మూలాలు, కాండం, కొమ్మలను వివరిస్తూ... దీని సమగ్ర స్వరూపాన్ని 10వ అధ్యాయం 'ది ట్రీ ఆఫ్ ఐడియలిజం - అవర్ ఐడియలాజికల్ బేసిస్'లో ఆవిష్కరించారు. ఈ సమాజంలో ఏ లక్షణాలు ఏయే స్థానంలో ఉండాలి, ఎవరు ఏ స్థానంలో ఉండాలో క్రమానుగతంగా వివరించారు. "ఇగోయిజం నిండిన సమాజం ఐడియల్స్ ప్రాతిపదికగా మారాలి. ఈ సంస్కరణ (రిఫార్మేషన్) అతి క్లిష్టమైన ప్రక్రియ'' అని 11వ అధ్యాయం 'సోషల్ రిఫామ్ అండ్ ది సోషల్ విల్'లో పేర్కొన్నారు. పాఠ్య పుస్తకాల్లో ఐడియలిజాన్ని చేర్చాలని అభిప్రాయపడ్డారు. 'సమతుల్యత' (బ్యాలెన్స్) లేకపోవడమే మనుషుల్లో అతిపెద్ద లోపమని 12వ అధ్యాయమైన 'నేచర్ అండ్ బ్యాలెన్స్'లో పేర్కొన్నారు.


 
Top