GuidePedia

0





మొన్న ఐస్‌క్రీమ్తో సరికొత్త చిత్ర నిర్మాణ పద్ధతికి శ్రీకారం చుట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మఇప్పుడు హీరో మంచు విష్ణుతో కలసి సినిమా అమ్మకాల విషయంలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. మధ్యవర్తులు ఎవరూ లేకుండానే, ఇంటర్నెట్ వాడుతూ, సినీ వ్యాపారం మీద ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తమ సినిమాను కొనుగోలు చేసేందుకు వీలుగా filmaction.inఅనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆగస్టు 15న తమ కాంబినేషన్‌లో విడుదల కానున్న కొత్త సినిమా (టైటిల్ ప్రకటించలేదు)తో ఈ వినూత్న పద్ధతిని మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం వర్మ, విష్ణు ప్రకటించారు.
 
వర్మ మాట్లాడుతూ -  ‘‘ఆ సైట్‌లో ఫలానా హాలుకి మా సినిమా కొనాలంటే రేటు ఇంత అని నేరుగా పెట్టేస్తాం. ఎవరైనా ఆ రేటుకు, ఆ హాలు వరకు సినిమా కొనుక్కోవచ్చు’’ అని వర్మ ప్రకటించారు. ‘‘నియమ నిబంధనలన్నీ ఆగస్టు ఒకటి నుంచి సైట్‌లో ఉంటాయి. అంతా పారదర్శకమే. ఇప్పటి దాకా కొద్దిమందే డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఈ వినూత్న విధానంతో వచ్చే కొత్తవాళ్ళతో కొన్ని వేలమంది తయారవుతారు’’ అని చెప్పారు.
హీరో విష్ణు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి దాకా తెలుగునాట 300 హాళ్ళతో ఇలా సినిమాల కొనుగోలు, విడుదలకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఒకవేళ కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోతే, మా సినిమా మేమే విడుదల చేసుకుంటాం. ఇక్కడ బుద్ధిబలం వర్మది. భుజబలం నాది’’  అని చెప్పారు.
 
 ‘‘దేశంలోనే తొలిసారిగా ఈ రకమైన ఆలోచన చేస్తున్నాం. నలుగురు స్టూడెంట్లు కలిసి కూడా ఒక సినిమాను కొనుక్కొనేందుకు వీలు కల్పించే ఈ ప్రతిపాదన వల్ల సినిమాపై వ్యాపారం పెరుగుతుంది. ఇలా సినిమా పంపిణీ, కొనుగోలు వ్యవస్థను మొత్తాన్నీ సమూలంగా మార్చాలని భావిస్తున్నా’’ అని వర్మ వివరించారు. కేవలం తమ సినిమాకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఎవరైనా వేరే దర్శక, నిర్మాతలు తమను సంప్రతిస్తే, వారి చిత్రాలకూ తమ ఫిల్మ్ ఆక్షన్ డాట్ ఇన్వెబ్‌సైట్ ద్వారా ఈ పద్ధతిలో సహకరిస్తామని వర్మ, విష్ణు ప్రకటించారు.
 ఇలాంటి ఐడియా రావడం గ్రేట్ అని డిస్ట్రిబ్యూటర్లు సైతం అభినందించినట్లు వర్మ తెలిపారు.

ఐస్‌క్రీమ్చిత్ర నిర్మాణం విషయంలో తనపై వచ్చిన విమర్శల్ని వర్మ ప్రస్తావిస్తూ, ‘‘ఎవరేమన్నా నా పద్ధతి నాది. బొమ్మ కనబడుతోందా, సౌండ్ వినబడుతోందా అనేదే నా లెక్క. అంతేతప్ప, సినిమా ఎలా, కెమేరాతో తీశామన్నది ముఖ్యం కాదు. ఇక నుంచి టైటిల్స్‌లో కూడా టెక్నికల్ డెరైక్టర్, క్రియేటివ్ డెరైక్టర్ అనే రెండే పేర్లు వేయాలనుకుంటున్నా’’ అని మరో సంచలనాత్మక ప్రకటన చేశారు. సినీ వ్యాపారంలో నూతన విప్లవానికి శ్రీకారం చుడుతున్న వర్మ ఏ మేరకు విజయం సాధిస్తారో, ఎంతమంది దీన్ని స్వాగతిస్తారో వేచి చూడాలి.

Post a Comment

 
Top