GuidePedia

0


ఆంధ్రప్రదేశ్‌లో 14 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు, అదనంగా ఏర్పాటుచేసేవి కలిపి మొత్తం 14 అవుతాయని సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళంతో పాటు చిత్తూరు జిల్లా కుప్పంలోనూ కొత్త విమానాశ్రయాలు రానున్నాయి. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో భాగంగా కేంద్ర ప్రభుత్వమే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేదని తెలియడంతో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నెల్లూరులో మధ్య స్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కడపలో ఇప్పటికే ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్న విమానాశ్రయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాజమండ్రి, పుట్టపర్తిల్లో ఇప్పటికే రెండు మధ్యస్థాయి విమానాశ్రయాలున్నాయి. మిగిలిన చోట్ల చిన్నస్థాయి విమానాశ్రయాలు(ఎయిర్‌స్ట్రిప్‌)లు ఏర్పాటుచేయనున్నారు. కుప్పం, శ్రీకాకుళం, కర్నూలు, ఒంగోలు తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు బొబ్బిలి వద్ద ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను రక్షణ విభాగం తీసుకుంటుందని సమాచారం. వీటన్నింటిపైనా సీఎం చంద్రబాబు ఆదివారమిక్కడ తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, సతీష్‌చంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, గిరిధర్‌, సాయిప్రసాద్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. కుప్పం నుంచి పూలు, పండ్లు తదితర వ్యవసాయ వస్తువులను ఎగుమతి చేసేందుకు ఎయిర్‌స్ట్రిప్‌ ఉపయోగపడుతుందని అనుకున్నారు. పుట్టపర్తిలో విమానాల సర్వీసింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, కేంద్రం నుంచి ఈ దిశగా ఏం కావాలో తెచ్చుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు సూచించారు. విజయవాడలో విమాన ఇంధనాన్ని నింపే కేంద్రం ఏర్పాటుచేయాలని, రాష్ట్రంలో కొనుగోలు చేసే విమాన ఇంధనంపై కేవలం ఒక్క శాతం మాత్రమే పన్ను వసూలుచేద్దామని అన్నట్లు సమాచారం. దీనివల్ల విమానాల రాకపోకలు పెరుగుతాయని, పరోక్షంగా పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం.

Post a Comment

 
Top