GuidePedia

0


సైకో థ్రిల్లర్ కథ...
మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో అనుక్షణం కథ సాగుతుంది. ఎలాంటి కారణం లేకుండా తన స్వప్రయోజనం కోసం వరుసగా అమ్మాయిల్ని హత్య చేసే ఓ సైకో కిల్లర్ కథ ఇది. అతడిని పట్టుకునే క్రమంలో ఓ ఇంటలిజెన్స్ పోలీస్ ఆఫీసర్‌కు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ హత్యలకు గల మూలాలేంటి? వాటి వల్ల ఎవరికి ఉపయోగం? ఆ కిల్లర్‌కు ఎవరితో శతృత్వముంది? అనే అంశాల సమాహారంగా సినిమా వుంటుంది. నా కెరీర్‌లో సైకో థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. బెంగళూరు, అమెరికాలలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలతో పాటు చాలా పుస్తకాలు, డాక్యుమెంటరీలు చూసి, పరిశోధన చేసి కథను తయారుచేసుకున్నాను. పోలీస్, సైకియాట్రిస్ట్, హంతకుడు... ముగ్గురు చుట్టూ కథ నడుస్తుంది.
సీరియస్ లుక్ నచ్చడంతో ...
విష్ణు అప్పియరెన్స్, సీరియస్‌నెన్ నిజమైన పోలీస్‌ను తలపిస్తాయి. రౌడీసినిమా చేస్తున్న సమయంలో అతనిలో దాగున్న ఈ లక్షణాల్ని గమనించే అనుక్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రకు విష్ణును ఎంచుకున్నాను. ఇందులో అతని పాత్ర చిత్రణ సర్ఫరోష్ సినిమాలో అమీర్‌ఖాన్‌ను గుర్తుకుతెస్తుంది. రఫ్ అండ్ టఫ్‌గా వుంటూనే , ప్రజల్లో ఆలోచనను రేకెత్తించే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విష్ణు అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. మానసిక వైద్యురాలి పాత్రకు రేవతి పూర్తిగా న్యాయం చేసింది. ప్రధానమైన సైకో కిల్లర్ పాత్రలో సూర్య అనే కొత్త నటుడ్ని సినీ పరిశ్రమకు పరిచయంచేస్తున్నాం. ఇటువంటి పాత్రకు కొత్త నటుడైతేనే సరిపోతాడనే ఉద్దేశంతో అతడిని తీసుకొన్నాం.
అలా అనుకోవడం మూర్ఖత్వమే...
నిజజీవితంలో మనచుట్టూ జరిగే నేరాలకు, సినిమాలకు ఎటువంటి సంబంధముండదు. సినిమాల్ని చూసి హంతకులు స్ఫూర్తిపొందుతున్నారనుకోవడం మూర్ఖత్వమే. సినిమాలు పుట్టకముందు నుంచి నేరాలు జరుగుతున్నాయి. కేవలం సినిమాల మూలంగానే వాటి సంఖ్య పెరుగుతోంది అనేది పూర్తిగా అబద్ధం. సినిమా అనేది సమాజంలో ఏం జరుగుతోంది అనే విషయాన్ని మాత్రమే చూపిస్తుంది. అంతేకానీ కొత్త సమస్యల్ని సృష్టించదు. సైకో కిల్లర్స్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే అంశాన్ని మాత్రమే అనుక్షణం సినిమాలో చర్చించాను. ఎటువంటి నేరాలను ప్రొత్సహించే విధంగా ఈ సినిమా వుండదు. నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేచిత్రమిది.
సందేశాల ద్వారా ప్రజల్లో మార్పురాదు
సలహాలు, సందేశాలిచ్చే సామర్థ్యం దర్శకులకు వుండదని నా అభిప్రాయం. సందేశాత్మక చిత్రాలు చూసి ప్రజల్లో మార్పు వస్తుందంటే నేను నమ్మను. అందుకే నా సినిమాల ద్వారా ఎలాంటి సందేశాల్ని ఇవ్వడానికి ప్రయత్నించను.
ఒక్కరు రాని రోజు..
ఐస్‌క్రీమ్ లాంటి సినిమాను థియేటర్‌లో ఒక్క ప్రేక్షకుడు చూసినా అది విజయవంతమైనట్లే అని నా అభిప్రాయం. అలా ఒక్కరు రాని రోజున ఆ తరహా సినిమాల్ని తీయడం మానివేస్తాను. నా వరకూ ఓ సినిమా కోసం నిర్మాత ఎంత ఖర్చు పెట్డాడు? ఎంత వచ్చింది? అనేదే ముఖ్యం. ఐస్‌క్రీమ్ లాంటి సినిమాల వల్ల నిర్మాత ఏ విధంగాను నష్టపోడనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
కెసీఆర్ సినిమా గురించి...
కెసీఆర్ సినిమా గురించి ఇప్పడే చెప్పను. బాలీవుడ్ చిత్రం ఎక్స్‌ఎస్‌ను ఆక్టోబర్ చివరి వారంలో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అనుక్షణం సినిమాను ఇంగ్లీష్‌లో రీమేక్‌చేయాలనే ఆలోచనలో వున్నాను. అలాగే ఓ ప్రేమకథను తెరకెక్కించాలనే ఆలోచనలో వున్నాను.

Post a Comment

 
Top