స్వతహాగా తెలుగువాడైనప్పటికీ తమిళంలో స్టార్ హీరోగా సెటిల్ అయిన విశాల్ ‘పందెం కోడి’, ‘పొగరు’, ‘భరణి’, ‘పల్నాడు’ లాంటి సినిమాలతో తెలుగు వారికి కూడా సుపరిచితుడే. విశాల్ హీరోగా తన స్వీయ నిర్మాణ సంస్థలో చేసిన సినిమా ‘నాన్ సిగప్పు మనిదన్’. ఈ సినిమా ఏప్రిల్ 11న తమిళ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇదే సినిమాని ‘ఇంద్రుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. త్వరలో తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా విశేషాలను తెలుసు కోవడం కోసం విశాల్ తో కాసేపు చిట్ చాట్ చేసాము. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ‘ఇంద్రుడు’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
స) ‘ఇంద్రుడు’ సినిమాలో నార్కొలిప్సి అనే ఒక స్లీపింగ్ డిజార్డర్ ఉన్న పాత్ర పోషించాను. లక్ష మందిలో ఒకరికి ఈ డిజార్డర్ ఉంటుంది. ఈ డిజార్డర్ ఉన్నవారు విపరీతమైన కోపం, బాగా సంతోషపడే సందర్బం, లేదా ఏ హై ఎమోషన్ కి గురైనా నిద్రపోతాడు. మళ్ళీ ఎప్పుడు లేస్తాడో తెలియదు. తను లేవడానికి 10 నిమిషాలు, ఒక గంట లేకపోతే కొన్ని రోజులైనా పట్టొచ్చు. అలాంటి డిజార్డర్ ని ఓవర్ కమ్ చేయడానికి ఏమేమి చేసాడు అనేది ఇందులో చూపించాం.
ప్రశ్న) ‘ఇంద్రుడు’ సినిమా గురించి చెప్పండి?
స) ఇంద్రుడు అనే ఒక రివెంజ్ డ్రామా. కానీ రెగ్యులర్ గా ఉండకుండా ఒక డిజార్డర్ ఉన్న వ్యక్తితో రివెంజ్ డ్రామా ఎలా తీశారు అన్నది ఆసక్తిగా ఉంటుంది. చెప్పాలంటే ఈ మూవీలో హీరోకి 10 కోరికలు ఉంటాయి. అవి మామూలు మనుషులకి చాలా సులభం కానీ ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కష్టం. తను పెట్టుకున్న 10 కోరికలలో 10వ కోరిక ఎలా తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా సెకండాఫ్.
ప్రశ్న) యాక్షన్ హీరో అయిన మీరు ఇలాంటి కథ చేద్దాం అనుకున్నప్పుడు రిస్క్ తీసుకుంటున్నాం అనిపించలేదా?
స) మామూలుగా ప్రతి హీరోకి ఏదో కొత్తగా ట్రై చెయ్యాలి అనుకుంటారు. అవి కొంతమంది దర్శకుల రూపంలో అప్పుడప్పుడే వస్తుంటాయి, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఒక యాక్షన్ హీరోగా ఈ సినిమా స్టొరీ లైన్ విన్నప్పుడు కోపం వస్తే నిద్ర పోతాడు దాన్ని దాటి ఎప్పుడు విశాల్ కొడతాడు అని అడిగాను. స్క్రిప్ట్ మొత్తం విన్నాక ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్మకం కలిగి చేసాను. నేను అనుకున్నట్టుగానే రిజల్ట్ వస్తోంది. ఒక నటుడిగా నాకు ‘వాడు-వీడు’ తర్వాత విమర్శకుల నుంచి, ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చిన సినిమా ‘ఇంద్రుడు’.
ప్రశ్న) ఈ మధ్య ఏ హీరోయిన్ తో రానంతగా లక్ష్మీ మీనన్ తో లవ్ లో ఉన్నారు అనే వివాదం తెరపైకి వచ్చింది? దానిపై మీ కామెంట్?
స) మామూలుగానే ఒక హీరో – హీరోయిన్ కాంబినేషన్లో వరుసగా రెండవ సినిమా వస్తోంది అంటే పుకార్లు జనరేట్ అవుతాయి. అలా వచ్చినవే ఈ వార్తలు. అందులో నిజం లేదు. అలాగే లక్ష్మీ మీనన్ ని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని వార్తలు వస్తున్నాయి. నేను లక్ష్మీ మీనన్ ని లవ్ చేయడం లేదు, పెళ్లి కూడా చేసుకోవడం లేదు. చెప్పాలంటే లక్ష్మీ మీనన్ కి 18 సంవత్సరాలే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నన్ను జైల్లో వేస్తారు(నవ్వుతూ)..
ప్రశ్న) ఇప్పటికే రిలీజ్ చేసిన లిప్ లాక్ ఫోటోల వల్ల, పోస్టర్స్ వల్ల సినిమాలో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
స) ఈ మూవీలో ఒక లిప్ లాక్ మరియు అండర్ వాటర్లో ఒక సీక్వెన్స్ ఉన్న మాట వాస్తవమే. అవి మేము పబ్లిసిటీ కోసమో లేక సినిమాలో గ్లామర్ కోసమో చేసినవి కాదు. కథా పరంగా చేసిన సన్నివేశాలే..అది మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇది వరకూ చెప్పినట్టు నార్కొలిప్సి ఉన్న హీరోని ఆ డిజార్డర్ నుండి బయటకి తీసుకు రావడానికి హీరోయిన్ ప్రయత్నిస్తుంటుంది. అందులో భాగంగా వచ్చేవే ఆ సీన్స్. కానీ ఆ సీన్స్ లో ఎలాంటి వల్గారిటీ ఉండదు.
ప్రశ్న) మీ సొంత బ్యానర్ లో నిర్మించిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఎలా ఫీలవుతున్నారు?
స) సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయితే చాలా మంచిది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాలు విజయం సాధించినప్పుడే మాకు ఇంకా చాలా సినిమాలు చేయాలి అనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను మాత్రమే హీరోగా కాకుండా వేరే కొత్త వాళ్ళకి కూడా నా బ్యానర్లో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. దాని కోసం కథలు కూడా వింటున్నాను.
ప్రశ్న) యుటివి వారితో కలిసి ఈ సినిమాని నిర్మించడానికి గల కారణం ఏంటి?
స) యుటివితో కలిసి ఈ సినిమాని నిర్మించడానికి గల ప్రధాన కారణం చెప్పాలంటే ‘పల్నాడు’ రిలీజ్ టైంలో నా మీద బాధ్యతలు ఎక్కువైపోవడమే. చివరి రెండు వారలప్పుడు అటు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ చూసుకోవాలి, మరో వైపు థియేటర్స్, ప్రమోషన్స్ ఇలా అన్ని చూసుకోవడం కాస్త కష్టమైంది. అందుకే ఒక కార్పోరేట్ సంస్థ అయిన యుటివి వారితో కలిసి చేసాం. దానివల్ల నా మీద కాస్త ఒత్తిడి తగ్గింది. వాళ్ళు కూడా సినిమాని బాగా ప్రమోట్ చేసారు.
ప్రశ్న) డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తున్నారు? హరి కాంబినేషన్ లో రానున్న మూవీ ఎప్పుడు మొదలవుతుంది?
స) తమిళ్ లో వరుసగా ఉన్న కమిట్ మెంట్స్ వల్ల డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి వీలు కుదరడం లేదు. త్వరలోనే కాస్త ఫ్రీ అయ్యే అవకాశం ఉంది, అప్పుడు కచ్చితంగా తెలుగు సినిమా చేస్తాను. హరి డైరెక్షన్ లో నేను – శృతి హాసన్ జంటగా నటించనున్న సినిమా ఈ నెల 16 నుంచి సెట్స్ పైకి వెళుతుంది. దీపావళికి రిలీజ్ చేస్తాం..