GuidePedia

0


చేకోడి రేటింగ్  : 3/5
చిత్రం  :  లౌక్యం
బ్యానర్  : భవ్య క్రియేషన్స్
సంగీతం  : అనుప్ రూబెన్స్
ఛాయాగ్రహణం  : వెట్రి
ఎడిటర్  : యస్ అర్ శేకర్
స్క్రీన్ ప్లే : కోన వెంకట్, గోపి మోహన్
కథ, మాటలు : శ్రీధర్ సీపాన
నిర్మాత  : వి ఆనంద్ ప్రసాద్
దర్శకుడు  : శ్రీవాస్ 
నటినటులు  : గోపీచంద్, రాకుల్ ప్రీత్, బ్రహ్మానందం, పృద్వీ, సంపత్ రాజ్, ప్రదీప్ రావట్, పోసాని, చంద్ర మోహన్ తదితరులు...

దసరా పండగ రేసులో పవర్, ఆగడు చిత్రాల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లౌక్యం’. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం తర్వాత శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపిచంద్, రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు దర్శక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ లౌక్యాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. 
 
కథ :  స్నేహితుడు ప్రేమని నిలబెట్టాటానికి  వరంగల్ లో పెద్ద రౌడీ అయిన బాబ్జీ(సంపత్) ని ఎదిరించి ఆతని చెల్లెలను తీసుకొచ్చి తన మిత్రుడితో వివాహం జరిపిస్తాడు వెంకీ(గోపిచంద్).దాంతో వెంకీపై కక్ష పెంచుకుంటాడు బాబ్జీ. హైదరాబాద్ లో ఉండే వెంకీ కోసం వెదుకులాట ప్రారంభిస్తాడు బాబ్జీ.
మరో వైపు చంద్రకళ(రకూల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయిని ప్రేమిసాడు వెంకీ. అమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తున్న సమయంలోనే ఆమెపై కేశవ్ రెడ్డి(ముఖేశ్ రుషి)దాడి చేస్తాడు.ఆ దాడి నుండి చంద్రకళను వెంకీ కాపాడుతాడు.అదే సమయంలో వెంకీ తల్లి తండ్రులును బాబ్జీ కిడ్నాప్ చేస్తాడు.బాబ్జీ నుండి వెంకీ తన తల్లితండ్రులని ఎలా కాపాడుకున్నాడు? కేశవ్ రెడ్డి ఎవరు? చంద్రకళ పై ఎందుకు ఎటాక్ చేశాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హీరో :  గోపిచంద్‌కు వెంకీ పాత్ర  రొటిన్ కారెక్టరే. కాని చాలా వేరియేషన్స్, ఎక్స్‌ప్రేషన్స్ పలికించడానికి స్కోప్ లభించింది. తన ప్రత్యేకతను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోవడంతో కథతోపాటు ప్రయాణించి.. అక్కడక్కడ తన మార్కును వదిలి.. అవసరమైన పాటలు, ఫైట్లతో గోపిచంద్ పనికానిచ్చాడు. హీరోయిజం చుట్టే కథ తిరిగినా.. మిగిత పాత్రల మాటున గోపిచంద్ ప్రత్యేకత కనిపించదు.

ఇతరులు :  హిరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ చూడటానికి చాలా బాగుంది. సిప్పీ పాత్రలో బ్రహ్మనందం, బాయిలింగ్ స్టార్‌గా పృథ్వీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్ర భారాన్నంత బ్రహ్మనందం, పృథ్వీలు తమ భుజాలపై వేసుకుని ప్రేక్షకులను ఆలరించడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ప్రదర్శించిన గ్లామర్ డోస్ అతిగానే ఉంది. ఐటమ్ సాంగ్స్‌కు పాపులర్‌గా, తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారిన హంసానందిని ఈచిత్రంలో కొంత హుందాతనాన్ని కొంత తగ్గించుకుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగడం సహజం. సంపత్ అన్నగా,విలన్ గా నటించి మెప్పించాడు. మరో విలన్ ముఖేశ్ రుషీ కూడా పర్వాలేదనిపించాడు.

సాంకేతిక వర్గం : అనూప్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే సోసాగ ఉంది. అయితే చిత్రంలో రెండు పాటలు ఓకే అనిపిస్తాయి. వెట్రి ఛాయాగ్రహణం సినిమాకు ఓ హైలైట్ అని చెప్పాలి. సినిమాను చాలా అందంగా తెరకెక్కించాడు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ బాగా ఖర్చు పెట్టాడు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కోన, గోపీ శ్రీధర్ ల డైలాగ్స్ కొన్ని చోట్ల బావున్నాయి కానీ.. ప్రాస కోసం మరీ ప్రయాసపడ్డ ఫీలింగ్ చాలాచోట్ల కలుగుతుంది. శ్రీధర్ సీపాన రోటిన్ కథనే అందించాడు. గురువు కోన వెంకట్ ప్రభావం నుంచి ఇంకా శ్రీధర్ బయటకు రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే రొటిన్ కథకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది. శ్రీవాస్ డైరెక్టర్‌గా తన ముద్ర చూపించడానికి కానీ, కొత్తదనం కోసం కానీ ప్రయత్నించలేదు. టెస్టెడ్ ఫార్ములానే వాడుకుని విజయవంతంగా బయటపడ్డాడు. నటీనటుల నుంచి మంచి ఔట్‌పుట్ రాబట్టుకోవడంలో, స్క్రిప్టులో ఉన్న వేగాన్ని తెరమీద చూపించడంలో అతను సక్సెస్ అయ్యాడు.

ప్లస్ పాయింట్స్ :
·        బ్రహ్మానందం
·        బాయిలింగ్ స్టార్
·        సెకండ్ హాఫ్
డ్రా బాక్స్ :
·        రొటీన్ కథ
·        సంగీతం

చివరిగా :  కోన వెంకట్, గోపీ మోహన్ ల సక్సెస్ ఫార్ములా ప్రకారం సాగే సినిమా.  గుడుంబా శంకర్ దగ్గరి నుంచి మొన్న వచ్చిన రభస వరకు అనేక సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఐతే ఆ పోలికల మీద ఎక్కువ దృష్టిపెట్టే అవకాశం లేకుండా.. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయే స్క్రీన్ ప్లే, కడుపుబ్బ నవ్వించే కామెడీ ట్రాక్‌ల‌తో శ్రీవాస్, కోన, గోపీ బ్యాచ్ చాలా లౌక్యంగా సినిమాను సక్సెస్ బాట పట్టించే ప్రయత్నం చేశాయి. బ్రహ్మానందం కామెడీ పండితే సినిమా హిట్టే కాబట్టి.. ఆయన క్యారెక్టర్‌పై ఎక్కువ దృష్టిపెట్టారు. అసలు సెకండాఫ్ అంతా హీరో హీరోయిన్లు కూడా కనిపించకుండా బ్రహ్మినే లీడ్ క్యారెక్టర్లా కనిపిస్తాడు. అంతలా బ్రహ్మిని వాడేసుకున్నారు. బ్రహ్మికిది అలవాటైన క్యారెక్టరే కాబట్టి అల్లుకుపోయారు. బకరా అయ్యే క్యారెక్టర్లో మరోసారి నవ్వించాడు. ఇక బ్రహ్మికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది 30 ఇయర్స్ పృథ్వి. అసలు సినిమాలో పృథ్వి ట్రాక్ తీసేసి చూస్తే చాలా సాధారణంగా అనిపిస్తుందేమో. ఫస్టాఫ్‌లో ఓ పది నిమిషాలు, క్లైమాక్స్ లో ఓ పది నిమిషాలు పృథ్వి చెలరేగిపోయాడు. బాయిలర్ స్టార్ బబ్లూ అనే సీరియల్ హీరో క్యారెక్టర్లో పృథ్వి భలే నవ్వించాడు. ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ల ట్రాక్, పృథ్వి ట్రాక్ సరదాగా సాగి బండి నడిపించేస్తే.. సెకండాఫ్‌ను బ్రహ్మి చూసుకున్నాడు. చివర్లో పృథ్వి ఇంకో చెయ్యేశాడు. మొత్తానికి నవ్వులకు ఢోకా లేని లౌక్యంప్రేక్షకుల్ని సంతృప్తి పరిచేలాగే ఉంది. పండుగ సెలవుల్లో లౌక్యం చిత్రానికి పెద్దగా పోటీ కనిపించకపోవడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడంపైనే ఈ చిత్ర కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది.

Post a Comment

 
Top