GuidePedia

0



ఆగడు చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది?
దూకుడు తర్వాత మహేష్‌బాబుతో చేసిన చిత్రమిది కావడంతో ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. మునుపెన్నడూ లేనివిధంగా మహేష్‌బాబుని సరికొత్త పంథాలో చూపించాలని తపించాను. గ్రామీణ ప్రాంతంలో పనిచేసే పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా ఆయన పాత్రను డిజైన్ చేశాను. కథ కంటే ఎక్కువగా వినోదాన్ని పండించడంపైనే దృష్టిపెట్టాను. ఈ చిత్ర విజయానికి వినోదమే కారణమైంది.
సినిమా మొత్తం దూకుడు పంథాలోనే సాగిందనే విమర్శలు వస్తున్నాయి?
దూకుడుతో ఈ సినిమాను పోల్చలేం. పోలీస్ అనే కాన్సెప్ట్ వల్ల రెండు చిత్రాల్లో సారూప్యతలు కనిపించాయి. హీరో తెలివితేటలు, అతను ఆడే మైండ్‌గేమ్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ప్రతి సీన్ ప్రేక్షకుల్ని నవ్వించాలనే లక్ష్యంతో ఈ కథ తయారుచేశాను.
హీరో మొదలుకొని సినిమాలోని ప్రతి పాత్రతో సంభాషణల్ని వేగంగా చెప్పించారు. దీనివల్ల ప్రేక్షకులకు అసౌకర్యం కలుగుతుందని అనుకోలేదా? 

డైలాగ్స్ విషయంలో కూడా ఏదో ఒక కొత్తదనం వుండాలని అనుకున్నాను. సంభాషణలన్నీ పద్యం చెబుతున్నట్లు ఒక రిథమ్‌లో వుంటే బాగుంటుందనిపించింది. హీరో తన తెలివితేటలతో ప్రత్యర్థుల్ని బురిడీ కొట్టించే సన్నివేశాల్లో చిన్న కథలు చెబుతుంటాడు. వాటన్నింటినీ మహేష్‌బాబు సింగిల్‌షాట్‌లో శ్వాసతీసుకోకుండా చెప్పారు. ఇలా రిథమిక్‌గా డైలాగ్‌లు చెప్పడం కొత్తగా వుంటుందని టీమ్ అంతా భావించాం. సినిమాలోని డైలాగ్స్‌తో పాటు మహేష్‌బాబు చెప్పే చిన్న చిన్న కథల్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
మీ దర్శకత్వంలో వచ్చిన గత మూడు చిత్రాలు ఒకే పంథాలో వున్నాయనే భావన వుంది. మూడింటిలో హీరోను పోలీస్ పాత్రలో చూపించారు. కొన్ని ఎపిసోడ్స్ కూడా ఒకే తరహాలో వున్నాయంటున్నారు?
ప్రతి దర్శకుడికి ఓ ైస్టెల్ వుంటుంది. అలాగే నాక్కూడా ఓ ైస్టెల్ వుంది. దానివల్లే మూడు సినిమాలు ఒకేలా వున్నాయనే భావన కలుగుతోంది. ఆగడు సినిమా ప్రథమార్థం నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది. ద్వితీయార్థం వచ్చేసరికి నా మార్క్ కనిపిస్తుంది. అలా లేకపోతే ప్రేక్షకులు నిరుత్సాహపడతారని అనుకున్నాను.
ఎప్పుడూ లేని విధంగా ఆగడు సినిమా విషయంలో మీపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి?
దూకుడు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కాబట్టి ఆగడు పై అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమా ఆ స్థాయిలో లేదనుకునేవాళ్లు సహజంగానే విమర్శిస్తారు. ప్రేక్షకులు ఇలాంటి విషయాల్ని పట్టించుకోరు. అందుకే సినిమాను ఆదరిస్తున్నారు.
ఈ సినిమా గురించి రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు కదా..?
నాకు రామ్‌గోపాల్‌వర్మ అంటే చాలా గౌరవం...ఇష్టం. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకుంటారనుకోను. అందుకే ఆయన చేసిన కామెంట్స్‌పై నేను స్పందించను.
ప్రకాష్‌రాజ్ ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పిన కవితను విలన్ పాత్ర పోషించిన సోనూసూద్‌తో చెప్పించడానికి కారణమేమిటి?
ప్రకాష్‌రాజ్ చెప్పిన ఆ కవిత నాకు బాగా నచ్చింది. అందుకే దాన్ని సినిమాలో సోనూసూద్‌తో చెప్పించాను (నవ్వుతూ).
ప్రతినాయకుడిగా ప్రకాష్‌రాజ్ చేయాల్సిన పాత్రను సోనూసూద్ చేశారు కదా...ఏమైనా తేడా అనిపించిందా?
ఆ పాత్ర ఎవరూ చేసిన బాగానే వుంటుంది. సోనూసూద్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
సినిమా విషయంలో మీకు, ప్రకాష్‌రాజ్ మధ్య వివాదం తలెత్తింది. ప్రకాష్‌రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. మీరు మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించలేదు?
నాకు, ప్రకాష్‌రాజ్‌కు అభిప్రాయబేధాలు వచ్చిన మాట నిజమే. అందుకే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ విషయం గురించి ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. నేను పెట్టలేదు. ఇప్పుడు కూడా ఆ వివాదం గురించి మాట్లాడటం నాకిష్టం లేదు.
రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌లు మీ సినిమాల నుంచి తప్పుకున్నాక డైలాగ్స్‌పై మీరు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని అంటున్నారు?
కోన వెంకట్ కావొచ్చు... మరొకరు కావొచ్చు..నేను రైటర్స్ గురించి ఎక్కువగా పట్టించుకోను. స్వతహాగా నేను రచయితను. దూకుడు చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ నాదే. ఎవరో రాసిన డైలాగ్స్‌కు నా పేరు వేసుకుంటానంటే రాసినవాళ్లు ఊరుకోరు కదా. మాటల రచయితగా కొత్తగా నేను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదనుకుంటున్నాను.
మీ నుంచి తిరిగి ఆనందంలాంటి సినిమాల్ని ఆశించవచ్చా?
ప్రస్తుతం ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా తర్వాత ఆనందంలాంటి ఫీల్‌గుడ్ సినిమా చేయాలనే కోరిక వుంది. తప్పకుండా చేస్తాను.
క్లైమాక్స్‌లో బ్రహ్మానందం చేత కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి మరీ డాన్సులు చేయించారు. అంత అవసరమా?
ఒక ఫార్ములా వర్కవుట్ అవుతుంటే దాన్నే అందరూ ఫాలో అవుతారు. సినిమా అనేది ఒక వ్యాపారం. ఇక్కడ ఏది వర్కవుట్ అవుతుందో దాన్నే అందరూ అనుసరిస్తారు.
మీ తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తో అంటున్నారు?
మరో వారంలో నా తదుపరి చిత్ర వివరాల్ని వెల్లడిస్తాను. హీరో ఎవరో అప్పుడే చెప్తాను.


Post a Comment

 
Top